

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డిపై మాజీ భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసలు కురిపించాడు. ఓ ఇంటర్వ్యూలో తెలుగులో మాట్లాడిన ఆయన, క్లిష్ట పరిస్థితుల్లో ఇద్దరూ అద్భుతంగా రాణించారని కొనియాడాడు. ప్రారంభంలో నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించి జట్టును విజయానికి చేరువ చేయడం తిలక్ ప్రత్యేకతని పేర్కొన్నాడు. ఒత్తిడిని అధిగమించి లక్ష్య ఛేదనలో మ్యాచ్‌లను గెలిపించే సామర్థ్యం తిలక్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. నితీశ్ రెడ్డి కూడా కీలక సమయంలో అజేయ ఇన్నింగ్స్ ఆడి తన కెరీర్లో గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడని ప్రశంసించాడు. 160 నుంచి 180 పరుగుల స్కోర్లు నమోదయ్యే పిచ్‌లపై బ్యాటర్లు బంతిని, బౌలర్‌ను అంచనా వేసి ఆడటం ముఖ్యమని కార్తీక్ వివరించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్, బేవాన్ జేకబ్స్ అర్ధ శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ సాధించారు. లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. సంజూ శాంసన్ 14, అభిషేక్ శర్మ 27 పరుగులు చేసి వెనుదిరిగారు. అనంతరం తిలక్ వర్మ 25 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేయగా, నమన్ ధీర్ 17 బంతుల్లో 31 పరుగులతో వేగంగా ఆడాడు. నితీశ్ రెడ్డి 13 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నాలుగు వికెట్లు తీశాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!