

వైభవ్ సూర్యవంశీ తన దూకుడుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రస్తుత తరుణంలో.. అంతకుముందు ఇదే తరహాలో టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించిన యువ బ్యాటర్ అభిషేక్ శర్మ. నేడు అభిషేక్ పుట్టినరోజు. 2024 జులైలో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన అతడు.. తక్కువ కాలంలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. గతేడాది ఇంగ్లాండ్‌పై కేవలం 54 బంతుల్లో 135 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. ఆసియా కప్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 314 పరుగులు, 200 స్ట్రైక్‌రేట్‌తో తన విధ్వంసక బ్యాటింగ్‌ను చాటాడు. శ్రీలంకపై 61 పరుగుల ఇన్నింగ్స్‌తో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 931 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. డేవిడ్ మలన్ పేరిట ఉన్న 919 పాయింట్ల రికార్డును అధిగమించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 1,000కిపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.
అభిషేక్ శర్మ క్రికెట్ ప్రయాణంలో మాజీ భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రభావం ఎంతో ఉంది. కొవిడ్ సమయంలో యువీ వద్ద శిక్షణ తీసుకున్న అభిషేక్.. ఇప్పటికీ ఆయన మార్గదర్శకత్వాన్ని పొందుతున్నాడు. బ్రియాన్ లారా కూడా తనకు ఇష్టమైన క్రికెటర్ అని చెబుతాడు. బ్యాటింగ్‌తో పాటు పార్ట్‌టైమ్ స్పిన్‌తోనూ జట్టుకు ఉపయోగపడగలడు. చిన్న వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించిన అభిషేక్.. 2015-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో 1,200కిపైగా పరుగులు, 57 వికెట్లతో సత్తా చాటాడు. 17 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాడు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తనలోని సహజసిద్ధమైన హిట్టర్‌ను వెలుగులోకి తెచ్చి.. రికార్డులు బద్దలు కొట్టి భారత జట్టులో చోటు సంపాదించాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!