

టీమిండియా మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విజేత క్రిష్ శ్రీకాంత్ ఐపీఎల్ జట్ల కూర్పుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యాను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి తీసుకుంటే అది ఆ జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. హార్దిక్ రాకతో సీఎస్కే ఆల్‌రౌండర్ విభాగం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. మరోవైపు, హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు కూర్పు, ప్రదర్శన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొందని వ్యాఖ్యానించారు. ఈ ట్రేడ్ హార్దిక్‌తో పాటు ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రయోజనం కలిగించవచ్చని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
శివమ్ దూబేపై కూడా శ్రీకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎస్కే యాజమాన్యంలో ఉంటే దూబేను విడుదల చేయడానికి ట్రేడ్ అవసరం లేదని, అతడిని వేలంలోకి వదిలేసి అవసరమైతే తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేస్తానని అన్నారు. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ కోచింగ్ సిబ్బందిలో మార్పులు చేయాలని సూచించారు. ప్రస్తుత హెడ్ కోచ్ మహేళ జయవర్ధనే స్థానంలో భారత కోచ్ చంద్రకాంత్ పండిత్‌ను నియమించాలని అభిప్రాయపడ్డారు. ముంబైతో అనుబంధం ఉన్న పండిత్ మంచి వ్యూహకర్త అని, ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయే కోచ్ ముంబైకి అవసరమని పేర్కొన్నారు. హార్దిక్ నాయకత్వంలో ముంబై ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో శ్రీకాంత్ వ్యాఖ్యలు ఐపీఎల్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!