

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు మరోసారి రంగం సిద్ధమవుతోంది. దోహా వేదికగా జరగనున్న మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో ఇండియా-ఏ, పాకిస్థాన్-ఏ జట్లు నవంబర్ 22న తలపడనున్నాయి. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఏలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్లు ఉండగా, గ్రూప్-బిలో ఇండియా-ఏ, పాకిస్థాన్-ఏ, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్స్ జరగనుండగా, నవంబర్ 29న ఫైనల్ నిర్వహించనున్నారు.
ఇండియా-ఏ తన తొలి మ్యాచ్‌లో నవంబర్ 20న నేపాల్‌తో తలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 22న వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్-ఏతో కీలక మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశలో చివరిగా నవంబర్ 24న యూఏఈతో పోటీ పడుతుంది. టోర్నీలోని ఎక్కువ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కూడా వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియంలో జరగనుండగా, కొన్ని మ్యాచ్‌లకు యూనివర్సిటీ ఆఫ్ దోహా ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 19న ఇదే మైదానంలో టోర్నీ ప్రారంభ మ్యాచ్ జరగనుంది. గత ఏడాది టోర్నీలో జితేశ్ శర్మ నాయకత్వంలోని ఇండియా-ఏ జట్టు యూఏఈపై 148 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. అయితే పాకిస్థాన్-ఏ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం ఒమన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరినా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది. మరోవైపు పాకిస్థాన్-ఏ ఫైనల్లో సూపర్ ఓవర్ ద్వారా బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. 2026 టోర్నీలో ఇండియా-ఏ మెరుగైన ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!