

ఆదివారం జరిగిన పారా ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐదు వేల ఏళ్ల భారతీయ నాగరికత స్ఫూర్తితో రూపొందించిన బ్లేజర్లు చూపరులను ఆకట్టుకున్నాయి. స్ర్పింటర్ సిమ్రన్ శర్మ, స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్ త్రివర్ణ పతాకాన్ని చేతబూని మార్చ్‌పాస్ట్‌లో భారత బృందానికి నాయకత్వం వహించారు. ప్రాచీన సింధు లోయ ముద్రలను తలపించే బంగారు ఆకృతులు, సంప్రదాయ చిత్రాలను బ్లేజర్లపై పొందుపరిచారు. కాలర్‌పై ‘సప్త సింధు’ చిహ్నం, జేబుపై త్రివర్ణ పతాకం ప్రత్యేకంగా నిలిచాయి. ఈ దుస్తులు భారతదేశ గొప్ప వారసత్వానికి నివాళిగా నిలిచాయని భారత పారాలింపిక్ కమిటీ పేర్కొంది.
ఈ క్రీడల్లో 112 మంది పురుషులు, 56 మంది మహిళలతో కలిపి మొత్తం 168 మంది భారత అథ్లెట్లు 11 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. అందించిన సమాచారం ప్రకారం, అక్టోబర్ 24 వరకు జరిగే ఈ పోటీల్లో 45 దేశాలకు చెందిన సుమారు 3,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 100 పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత జట్టు సిద్ధమైందని పారా అథ్లెటిక్స్ ప్రధాన కోచ్ సత్యనారాయణ తెలిపారు. క్రీడాకారులు ఈ లక్ష్యాన్ని చేరుకుంటారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో భారత్ 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలతో మొత్తం 111 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. ఈసారి కూడా అదే స్థాయి ప్రదర్శనతో మరిన్ని విజయాలు సాధించాలని భారత బృందం లక్ష్యంగా పెట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!