

ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్ జగ్‌శేర్ సింగ్ సత్తాచాటాడు. అబ్బాయిల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన యువాన్ స్యూ జువాంగ్పై 6-15, 17-15, 15-12తో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ, ఒత్తిడిని అధిగమించి తర్వాతి రెండు గేమ్‌ల్లో అద్భుతంగా పుంజుకున్నాడు. దీంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో మలేసియాకు చెందిన లీ కియాన్ చాంగ్‌ను 15-8, 15-8తో ఓడించి జగ్‌శేర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇప్పుడు ఫైనల్లో స్థానం కోసం శుక్రవారం ఇండోనేసియాకు చెందిన బాయు వార్దానాతో తలపడనున్నాడు.
మరోవైపు, అమ్మాయిల సింగిల్స్‌లో భారత షట్లర్ షైనా మణిముత్తుకు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యి కింగ్ యిన్‌తో తలపడిన ఆమె 5-15, 8-15తో వరుస గేమ్‌లలో ఓటమి చవిచూసింది. దీంతో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జగ్‌శేర్ విజయం భారత్‌కు పతకాన్ని ఖాయం చేయగా, ఇప్పుడు అతడి తదుపరి పోరుపై ఆసక్తి నెలకొంది. సెమీఫైనల్లో గెలిస్తే అతడు ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు స్వర్ణం లేదా రజత పతకం సాధించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!