

ఇటీవలి ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి క్రికెట్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషులు, మహిళల జట్లు కూడా హాజరయ్యాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించిన మోదీ.. 140 కోట్ల మంది భారతీయులకు వారు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఈ విజయం క్రీడాకారులకే కాకుండా యావత్ దేశ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.
అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యమివ్వగల వేదికగా భారత్ ఎదుగుతోందని మోదీ అన్నారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ బిడ్ వేస్తోందని, ఆ క్రీడలను దేశంలో నిర్వహించాలన్నది తమ సంకల్పమని స్పష్టం చేశారు. అనంతరం పతక విజేతలతో కలిసి ఫొటోలు దిగారు. క్రీడాకారులు తమ సంతకాలతో కూడిన జెర్సీలను ప్రధానికి అందించగా, 17 ఏళ్ల రికర్వ్ ఆర్చరీ క్రీడాకారిణి కుమ్కుమ్ మొహోద్ ఆయనకు విల్లును బహూకరించింది. ఈ కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, ఐసీసీ చైర్మన్ జైషా సహా పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!