

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేటి యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. బెంగళూరులో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్‌తో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడుతూ, జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరాలు శారీరక వ్యాయామానికి, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. గతంలో రోజువారీ జీవితంలో సహజంగానే శారీరక కదలికలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఇంటి నుంచి కారులో కార్యాలయానికి వెళ్లడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, తిరిగి ఇంటికి చేరుకోవడం సాధారణమైందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల శరీరానికి తగినంత వ్యాయామం అందడం లేదని పేర్కొంటూ, ఆరోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
బద్ధకపు జీవనశైలి, నూనెలో వేయించిన పదార్థాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారం, ఫాస్ట్ ఫుడ్‌ను తరచుగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ధోనీ హెచ్చరించారు. అందుకే యువత ఫోన్లు, స్క్రీన్లకు పరిమిత సమయం కేటాయించి, ప్రతిరోజూ ఏదో ఒక క్రీడ లేదా శారీరక కార్యకలాపంలో పాల్గొనాలని ప్రోత్సహించారు. ఇదే కార్యక్రమంలో జావేద్ అక్తర్ నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రశంసించారు. పాత తరాలతో పోలిస్తే జెన్ జెడ్ అనేక విషయాల్లో మరింత పరిణతితో, సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్దలు తమకే అన్ని విషయాలు తెలుసని భావించకుండా, యువత ఆలోచనలు, అభిప్రాయాల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!