

భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటగాళ్లు తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలని పలువురు ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ముంబయి తరఫున హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 154 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ 140 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ముంబయి భారీ స్కోరు దిశగా సాగింది.
మూడో రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి ముంబయి 151 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 528 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు ఆకాశ్ ఆనంద్ (117 నాటౌట్) సెంచరీలు సాధించగా, కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (87), ముషీర్ ఖాన్ (57) అర్ధశతకాలతో రాణించారు. సర్ఫరాజ్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 18వ శతకం. మరోవైపు, ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకు సింగ్ గోవాతో జరిగిన మ్యాచ్‌లో 186 బంతుల్లో 118 పరుగులు చేసి తన సత్తా చాటాడు. జాతీయ జట్టులో చోటు కోసం పోటీ పెరుగుతున్న వేళ, దేశవాళీ క్రికెట్లో వీరి ప్రదర్శనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!