

న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. తొలి టీ20లో రికార్డు విజయాన్ని అందుకుని జోరు మీదున్న భారత జట్టుకు రెండో మ్యాచ్‌కు ముందు ఎదురుదెబ్బ తగిలింది. గజ్జల్లో నొప్పితో బాధపడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండో టీ20కి దూరం కానున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. అతడి స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తొలి మ్యాచ్‌లో ఇషాన్ ఇబ్బంది పడటంతో తిలక్ వర్మను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించినట్లు కోటక్ వివరించారు. ఇషాన్ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని పేర్కొన్నారు.
వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వస్తే భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశముండగా, వైభవ్ కూడా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలడు. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో ఎవరిని ఆడిస్తారనే ఆసక్తి నెలకొంది. గతంలో వన్‌డౌన్‌లో ఆడిన అనుభవం ఉన్న సంజు శాంసన్‌కు కూడా ఆ అవకాశం దక్కవచ్చు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 శనివారం క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది. తుది జట్టు ఎంపికతో భారత జట్టు బ్యాటింగ్ కూర్పుపై స్పష్టత రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!