

నడుము కింది భాగం పనిచేయక వీల్‌చైర్‌కే పరిమితమైనా.. సువర్ణ రాజ్ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. క్రీడల్లో రాణిస్తూనే సమాజసేవలోనూ తనదైన ముద్ర వేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తాజాగా పారా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి తన ప్రతిభను చాటుకుంది. న్యాయవాదిగా పనిచేస్తున్న సువర్ణ.. దివ్యాంగులు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకుని వారి హక్కుల కోసం పోరాడుతోంది. ప్రత్యేక అవసరాలున్న వారు డిజిటల్ వనరులను వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. దివ్యాంగుల్లో ఎన్నికలపై అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించింది. సామాజిక సేవతో పాటు క్రీడలపై దృష్టి సారించిన ఆమె.. డిస్కస్ త్రో, షాట్‌పుట్‌లో నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.
ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, మెరుగైన శిక్షణతో సువర్ణ తన క్రీడా నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి టోర్నీలో కాంస్య పతకాన్ని సాధించింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో జరిగిన పోటీల్లో డిస్కస్ త్రోలో స్వర్ణం, షాట్‌పుట్‌లో రజతం గెలుచుకుంది. పారా ఆసియా క్రీడలకు ముందు ఆమెపై పెద్దగా అంచనాలు లేకపోయినా, అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. చివరకు స్వర్ణ పతకంతో తిరిగొచ్చి తన సత్తా చాటింది. శారీరక పరిమితులు లక్ష్యాలకు అడ్డంకి కావని నిరూపించిన సువర్ణ రాజ్ ప్రయాణం.. పట్టుదల, ఆత్మవిశ్వాసం, సేవాభావానికి నిలువెత్తు నిదర్శనం.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!