

ఏఐ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మనుషుల ప్రమేయం లేకుండానే ఏఐ తనను తాను మరింత అభివృద్ధి చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ఆంత్రోపిక్ హెచ్చరించింది. ‘వెన్ ఏఐ బిల్డ్స్ ఇట్సెల్ఫ్: అవర్ ప్రోగ్రెస్ టువార్డ్ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్’ అనే బ్లాగ్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ (RSI) అంటే ఏఐ వ్యవస్థలు తమ తదుపరి వెర్షన్లను తామే రూపొందించుకుని నిరంతరం మెరుగుపరుచుకునే సామర్థ్యం కలిగి ఉండడం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోయినా, అది ఊహించిన దానికంటే త్వరగా రావచ్చని సంస్థ పేర్కొంది.
ప్రస్తుతం ఏఐ మోడళ్లు కోడింగ్, డీబగ్గింగ్, పరిశోధన, సమస్యల పరిష్కారం వంటి రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆంత్రోపిక్ తెలిపింది. భవిష్యత్తులో ఇదే సామర్థ్యం ఏఐ అభివృద్ధిని మరింత వేగవంతం చేసే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఒకవైపు శాస్త్రం, వైద్యం, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదపడగలదని, మరోవైపు భద్రత, నియంత్రణ, మానవ పర్యవేక్షణ వంటి అంశాల్లో సవాళ్లు సృష్టించవచ్చని సంస్థ హెచ్చరించింది. అందువల్ల ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు ఇప్పటి నుంచే తగిన భద్రతా చర్యలు, అంతర్జాతీయ సహకార వ్యవస్థలను రూపొందించాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!