

సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే అదృశ్య సాంకేతికతను తలపించేలా నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ఇంజినీర్లు ‘ఫాంటమ్ ట్విస్ట్’ అనే వినూత్న డ్రోన్‌ను రూపొందించారు. ప్రత్యేకమైన కెమోఫ్లేజ్ లేదా పారదర్శక పదార్థాలను ఉపయోగించకుండా.. కేవలం వేగవంతమైన భౌతిక చలనం ద్వారా డ్రోన్‌ను మానవ కంటికి చాలా తక్కువగా కనిపించేలా చేశారు. ఈ డ్రోన్ గాల్లో ఎగురుతున్న సమయంలో తన మొత్తం శరీరాన్ని సెకనుకు 25 సార్లు వరకు తిప్పుకుంటుంది. దీంతో దాని స్పష్టమైన ఆకారం మోషన్ బ్లర్‌గా మారి, కంటికి మసక నీడలా కనిపిస్తుంది.
సాధారణ క్వాడ్‌కాప్టర్‌లకు భిన్నంగా ఫాంటమ్ ట్విస్ట్‌లో ఒక మోటార్, ఒక ప్రొపెల్లర్ మాత్రమే ఉంటాయి. ప్రొపెల్లర్ ఒక దిశలో తిరుగుతుండగా.. డ్రోన్‌లోని మిగతా భాగాలు వ్యతిరేక దిశలో తిరుగుతాయి. ఈ ప్రత్యేక డిజైన్ కారణంగా డ్రోన్‌లో స్థిరంగా ఉండే భాగాలు దాదాపుగా కనిపించకుండా పోతాయి. పరిశోధకుల ప్రకారం, సాధారణ డ్రోన్‌తో పోలిస్తే దీని దృశ్యమానత దాదాపు 10 రెట్లు తక్కువగా ఉంటుంది. అయితే ఇది పూర్తిగా అదృశ్యమవదు; ప్రొపెల్లర్ శబ్దం వినిపిస్తుంది, అలాగే వైర్లు, సపోర్ట్ రాడ్లు కొంతవరకు కనిపిస్తాయి.
వన్యప్రాణుల పరిశీలనకు ఉపయోగకరం
డ్రోన్లు కనిపించడంతో పక్షులు, జంతువుల సహజ ప్రవర్తనకు అంతరాయం కలిగే సందర్భాలు ఉన్నాయి. ఫాంటమ్ ట్విస్ట్ తక్కువగా కనిపించడం వల్ల గూళ్లలోని పక్షులను పరిశీలించడం, తడిబయళ్లను సర్వే చేయడం, పర్యావరణ పరిశోధనలు నిర్వహించడం వంటి పనుల్లో ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా మౌలిక వసతుల పరిశీలన, పర్యావరణ సర్వేల్లోనూ దీని వినియోగానికి అవకాశాలున్నాయి.
ఈ డ్రోన్ రూపకల్పనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆప్టిమైజేషన్ అల్గారిథమ్స్‌ను కూడా ఉపయోగించారు. స్థిరంగా ఎగరగల సుమారు 20,000 డిజైన్లను కంప్యూటర్ మోడల్ ద్వారా రూపొందించి, వాటిలో మానవ కంటికి తక్కువగా కనిపించే కాన్ఫిగరేషన్లను ఎంపిక చేశారు. అనంతరం వాస్తవ నేపథ్యాల్లో వాటి దృశ్యమానతను పరీక్షించి తుది డిజైన్‌ను అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో మరింత పారదర్శక పదార్థాలు, తక్కువ శబ్దంతో పనిచేసే ప్రొపల్షన్‌ను ఉపయోగించి దీన్ని ఇంకా తక్కువగా కనిపించేలా చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!