

జర్మనీకి చెందిన డిజైనర్ సైమన్ వెకెర్ట్ ఏఐ ఆధారిత వీడియో నిఘా వ్యవస్థలను తికమక పెట్టే ఉద్దేశంతో ప్రత్యేకమైన ‘డిజిటల్ కామోఫ్లాజ్’ చొక్కాను రూపొందించారు. బెర్లిన్ సహా పలు నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఏఐ కెమెరాలను వినియోగించే ప్రయత్నాల నేపథ్యంలో.. వాటి పనితీరును పరీక్షించేందుకు ఈ ప్రయోగం చేసినట్లు తెలిపారు. ఆయన షేర్ చేసిన దృశ్యాల్లో రోడ్డుపై నడుస్తున్న పలువురిని కెమెరా ‘పర్సన్’గా గుర్తించగా.. ప్రత్యేక చొక్కా ధరించిన వ్యక్తిని మాత్రం సరిగ్గా గుర్తించలేకపోయినట్లు కనిపించింది.
ఏఐ విజన్ వ్యవస్థలు మనుషులను గుర్తించేందుకు శరీరాకృతి, రంగులు, దుస్తులు, ఆకృతుల అంచులు వంటి పలు దృశ్య ఆధారాలను ఉపయోగిస్తాయి. అయితే సైమన్ రూపొందించిన చొక్కాపై ఉండే ప్రకాశవంతమైన రంగులు, ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టుగా కనిపించే ఆకారాలు వ్యక్తి అవుట్‌లైన్‌ను స్పష్టంగా గుర్తించడంలో కెమెరాను గందరగోళానికి గురిచేసేలా రూపొందించారు. ఈ డిజైన్‌ను అభివృద్ధి చేయడంలో కృత్రిమ మేధను కూడా ఉపయోగించినట్లు సైమన్ తెలిపారు. ఏఐ విజన్ సాంకేతికతలోని పరిమితులను బయటపెట్టడమే తన ఉద్దేశమని, మనుషులు ఒక దృశ్యాన్ని అర్థం చేసుకునే విధానానికి, ఏఐ దానిని విశ్లేషించే తీరుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ప్రయోగం స్పష్టం చేసిందని చెప్పారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!