

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (JPL) ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, ఐపీఓతో జియో ప్లాట్‌ఫామ్స్ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు. వాటాదారుల పట్ల జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు దీర్ఘకాలిక విలువను సృష్టించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ లిస్టింగ్‌తో భారతీయ రిటైల్ పెట్టుబడిదారులతో సంస్థకు ఉన్న సంబంధాలు మరింత బలపడతాయని, వాటాదారులు, వినియోగదారులు, ఉద్యోగులు, ఇతర భాగస్వాముల పట్ల బాధ్యత కూడా పెరుగుతుందని వివరించారు.
పారదర్శకత, సుస్థిర వృద్ధి, సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధికి జియో ప్రాధాన్యం ఇస్తుందని ఆకాశ్ అంబానీ తెలిపారు. మొబైల్ డేటా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన డిజిటల్ సేవలు అందించడం, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సేవలను విస్తరించడం, సంస్థాగత భాగస్వామ్యాలను బలోపేతం చేయడం తమ లక్ష్యాలని పేర్కొన్నారు. మెటా, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాయి. మరోవైపు, ఐపీఓ ప్రారంభమైన తొలిరోజే సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన స్పందన లభించింది. ఉదయం 10:34 గంటల సమయానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగం తమకు కేటాయించిన వాటాల కంటే 3.25 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ పొందగా, మొత్తం ఐపీఓ కూడా 1.01 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!