

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. వైభవ్‌లో అద్భుతమైన ప్రతిభ ఉందని ప్రశంసించిన శ్రేయస్.. అతడు ఇంకా చిన్నవాడేనని, జట్టులో అవకాశాలు అందుకోవడానికి చాలా సమయం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఓపెనర్లు నిలకడగా పరుగులు చేస్తున్నారని, ప్రపంచకప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించిన బ్యాటర్లు జట్టులో ఉన్నారని వివరించాడు. వైభవ్ ఇప్పుడే తుది జట్టులోకి వస్తాడని చెప్పలేమని స్పష్టం చేశాడు. అయితే, జట్టుతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లడం ద్వారా అక్కడి పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన పెంచుకోవచ్చని, భవిష్యత్తులో మరింత మెరుగ్గా సిద్ధమయ్యేందుకు అది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.
మరోవైపు, వరుస మ్యాచ్‌ల కారణంగా ప్రాక్టీస్‌కు తగినంత సమయం లభించడం లేదని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అయినప్పటికీ, జట్టు విజయాలపైనే దృష్టి సారిస్తోందని, సానుకూల దృక్పథంతో ఆడేందుకు సిద్ధమవుతోందని చెప్పాడు. న్యూజిలాండ్ పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండవచ్చని, అయితే మ్యాచ్ రోజునే పరిస్థితులపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాడు. బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ పేసర్ అందుబాటులో లేని సమయంలో భువనేశ్వర్ కుమార్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో సాధించిన విజయాలు, టీ20 బౌలింగ్‌పై అతడికున్న అవగాహన యువ బౌలర్లకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!