

మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్)ను మరింత బలోపేతం చేసే అంశాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చురుగ్గా పరిశీలిస్తోంది. ముంబైలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సదుపాయానికి సంబంధించి పలు అంశాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే, వాటిపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంటీఎఫ్ విధానాన్ని మరింత మెరుగుపరిచే దిశగా సెబీ ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా వెల్లడైంది.
రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్‌పై కొన్ని పరిమితులు విధించే అంశాన్ని సెబీ పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అలాంటి నిర్ణయం తీసుకుంటే ట్రేడింగ్ పరిమాణం, మార్కెట్ లావాదేవీల విలువ తగ్గే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సెబీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా, దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయాన్ని పొడిగించే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని పాండే స్పష్టం చేశారు. ఈ అంశం సెబీ ప్రాధాన్యతల్లో లేదని తేల్చిచెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!