

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నేరుగా కలవడం అరుదైన అవకాశం. అలాంటిది కేరళకు చెందిన 17 ఏళ్ల యువకుడు రౌల్ జాన్ అజు ఆయనతో సెల్ఫీ దిగాడు. ‘ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన అజు.. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సులో పుతిన్‌ను కలిసి ఫొటో తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మాస్కోలో గురువారం ప్రారంభమైన మూడు రోజుల ‘ఏఐ జర్నీ 2026’ సదస్సుకు భారత్, చైనా, సెర్బియా, యూఏఈ సహా పలు దేశాల ఏఐ నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోని ప్లీనరీ సెషన్‌కు పుతిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల వయసులో బాత్‌రూమ్‌లో తొలి వీడియో చేసినప్పటి నుంచి.. 17 ఏళ్లకే పుతిన్‌తో సెల్ఫీ దిగే స్థాయికి చేరుకోవడం వరకు తన ప్రయాణం ఎన్నో ఊహించని అవకాశాలను అందించిందని అజు ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని తెలిపాడు. రష్యా ఎంబసీ కూడా పుతిన్‌ను కలిసిన అత్యంత పిన్న వయస్కుల్లో అజు ఒకడని పేర్కొంది.
కేరళలోని కొచ్చికి చెందిన అజు ప్రస్తుతం కామర్స్ విభాగంలో 12వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే సాంకేతికతపై ఆసక్తి పెంచుకున్న అతడు తొమ్మిదేళ్ల వయసులోనే ఏఐ నేర్చుకోవడం ప్రారంభించాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే తన తండ్రి సహకారంతో ఏఐ టూల్స్‌పై పట్టు సాధించాడు. 12 ఏళ్ల వయసులోనే స్కూల్ ప్రాజెక్ట్ కోసం ‘మిబాట్’ పేరుతో ఓ రోబోట్‌ను తయారు చేశాడు. ఇప్పటివరకు 15 ఏఐ ఆధారిత టూల్స్‌ను అభివృద్ధి చేసిన అజు.. ‘ఏఐ రియల్మ్ టెక్నాలజీస్’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఇందులో 15 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులకు ఏఐ శిక్షణ అందిస్తున్నట్లు సమాచారం. ‘థింక్‌క్రాఫ్ట్ అకాడమీ’ ద్వారా ఐఐటీలు, ఐఐఎంలు, విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నాడు. ఈ కంపెనీలో అజు తండ్రి కూడా ఉద్యోగిగా పనిచేస్తూ నెలకు రూ.2 లక్షల జీతం పొందుతుండటం విశేషం.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!