

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రెండు వేర్వేరు లేఖలు రాశారు. ఖరీఫ్-2026లో పీఎం-ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ వంటి తొమ్మిది పంటల అంచనా దిగుబడిని ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 100 శాతం కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, తక్కువ ధరలకు పంటలు విక్రయించాల్సిన పరిస్థితి రాకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వివరించారు.
ఆర్‌కేవీకే కిసాన్ డ్రోన్ కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ నిధులను, మట్టి నమూనాల పరీక్షలకు సంబంధించిన నిధులను, 2026-27కు సంబంధించిన కేటాయింపులను త్వరగా విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. మరో లేఖలో పేదల కోసం ఇప్పటికే 3 లక్షల ఇళ్లను మంజూరు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన గృహ అవసరాలను తీర్చేందుకు మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి ప్రతి అర్హమైన పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!