

హైదరాబాద్‌లోని హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో జరిగిన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘన చరిత్ర కలిగిన తెలంగాణ, హైదరాబాద్‌కు సమావేశం కోసం విచ్చేసిన అతిథులు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. 2047 సంవత్సరం దేశానికి ఎంతో ప్రాధాన్యమైనదని, అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా తెలంగాణను క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు ప్రాంతాలుగా విభజించినట్లు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని క్యూర్ ప్రాంతంలో సేవారంగానికి ప్రాధాన్యం ఇస్తామని, ORR నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య ఉన్న ప్యూర్ ప్రాంతంలో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. RRR వెలుపల ఉన్న రేర్ ప్రాంతంలో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు.
రోడ్లు, భవనాల శాఖ కేవలం రహదారుల నిర్మాణానికే పరిమితం కాకుండా ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కృషి చేస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి, టిమ్స్ ఆసుపత్రులు సహా వివిధ వైద్య సంస్థల ద్వారా అదనంగా 8 వేల పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశ భద్రత, జాతి ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు తావు లేదని, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారని, వాటికి ప్రతినిధులందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు దేశాభివృద్ధికి ఈ సదస్సు కీలకంగా నిలుస్తుందని చెప్పారు. ఈ సమావేశానికి అందరినీ ఆహ్వానిస్తూ తన ప్రసంగాన్ని “జైహింద్.. జై తెలంగాణ” నినాదాలతో ముగించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!