

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అంచనాలు వెల్లడించాయి. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 30 నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది మరింత బలపడి డిసెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపారు. అనంతరం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దాని గమనం, తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కూడా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!