

ప్రతిపాదిత పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో తమిళనాడు ప్రయోజనాలపై ఎలాంటి రాజీ ఉండబోదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల కలిగే నష్టాలపై దేశంలో తొలుత గళమెత్తింది డీఎంకేనేనని ఆయన పేర్కొన్నారు. న్యాయమైన డీలిమిటేషన్ కోసం జాతీయ స్థాయి నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి తొలి సమావేశాన్ని చెన్నైలో నిర్వహించినట్లు గుర్తుచేశారు. తమిళనాడుకు పార్లమెంటులో ఉన్న ప్రాతినిధ్యం తగ్గించే ఎలాంటి నిర్ణయాన్నైనా తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో డీఎంకే వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్టాలిన్ తేల్చిచెప్పారు.
తమిళనాడు అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానం, న్యాయమైన డీలిమిటేషన్ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే తమ పార్టీ ముందుకు సాగుతుందని స్టాలిన్ తెలిపారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచినా తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకూడదని ఆయన డిమాండ్ చేశారు. అలాగే 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య నిర్ణయించిన పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఈ రెండు డిమాండ్ల విషయంలో డీఎంకే వెనక్కి తగ్గబోదని, రాజీకి తావు లేదని స్టాలిన్ స్పష్టం చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!