

చలికాలంలో తీవ్రమైన చలి నుంచి రక్షణ పొందేందుకు విద్యుత్ దుప్పట్లు ఉపయోగకరమైన, తక్కువ విద్యుత్తును వినియోగించే ప్రత్యామ్నాయంగా మారాయి. వీటిలో ప్రత్యేకంగా అమర్చిన ఇన్సులేటెడ్ హీటింగ్ వైర్లు విద్యుత్ సరఫరా అందినప్పుడు వేడిని ఉత్పత్తి చేస్తాయి. దుప్పటికి అనుసంధానించిన కంట్రోల్ యూనిట్ విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తూ కావాల్సిన ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. సాధారణంగా కొన్ని నిమిషాల్లోనే దుప్పటి వెచ్చగా మారుతుంది. అధిక వేడిని నివారించేందుకు ఓవర్‌హీటింగ్ సేఫ్టీ థర్మోస్టాట్, థర్మోస్టాట్ కంట్రోలర్ వంటి భద్రతా వ్యవస్థలు ఇందులో ఉంటాయి. నిర్దేశిత ఉష్ణోగ్రతను మించినప్పుడు ఈ వ్యవస్థలు విద్యుత్ సరఫరాను నిలిపివేసి దుప్పటి మరింత వేడెక్కకుండా చూస్తాయి. అయితే ఈ సౌకర్యాన్ని సురక్షితంగా పొందాలంటే నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
పాతబడిన, దెబ్బతిన్న లేదా నాసిరకం విద్యుత్ దుప్పట్లను ఉపయోగించడం వల్ల కాలిన గాయాలు, విద్యుత్ ప్రమాదాలు సంభవించవచ్చు. అందువల్ల కొనుగోలు చేసే ముందు తయారీదారు వివరాలు, భద్రతా ధ్రువీకరణ గుర్తులు, వైరింగ్ నాణ్యత, ఆటోమేటిక్ షట్‌ఆఫ్ వంటి సదుపాయాలను పరిశీలించాలి. దుప్పటిని గట్టిగా మడవడం, దానిపై బరువైన వస్తువులు ఉంచడం వంటివి చేయకూడదు. ఉపయోగం తర్వాత చదునుగా లేదా వదులుగా చుట్టి భద్రపరచాలి. దుప్పటిలో అసమానంగా వేడి రావడం, కాలిన వాసన, మరకలు, బట్ట చిరగడం లేదా వైర్లు బయటపడటం గమనిస్తే వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి దానిని ఉపయోగించడం ఆపేయాలి. వృద్ధులు, మధుమేహం ఉన్నవారు, నరాల సమస్యలతో బాధపడేవారు, వేడిని సరిగ్గా గుర్తించలేని వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పెంపుడు జంతువులు దుప్పటిని గోకకుండా కూడా జాగ్రత్తపడాలి. సరైన పద్ధతిలో వినియోగిస్తే విద్యుత్ దుప్పట్లు చలికాలంలో సౌకర్యవంతమైన నిద్రకు, శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా తక్కువ విద్యుత్తుతో సమర్థంగా పనిచేస్తాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!