

అండర్‌వరల్డ్ డాన్, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం మరోసారి వార్తల్లో నిలిచాడు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) కోసం పనిచేసినట్లు చెప్పుకుంటున్న పాకిస్థాన్ మూలాలున్న అమెరికన్ పౌరుడు కమ్రాన్ ఫరీదీ తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో దావూద్‌కు సంబంధించి పలు సంచలన విషయాలను వెల్లడించాడు. దావూద్ ఇప్పటికీ పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడని, అక్కడ అతడికి మూడు రహస్య స్థావరాలు ఉన్నాయని కమ్రాన్ పేర్కొన్నాడు. అతడి భద్రత, ఆర్థిక లావాదేవీలు, విలాసవంతమైన జీవితం గురించి కూడా వివరించాడు. 2018లో దావూద్‌కు అత్యంత సన్నిహితుడైన జాబిర్ మోతీవాలా లండన్‌లో అరెస్టు కావడం వెనుక తన పాత్ర ఉందని కమ్రాన్ చెప్పాడు. యూకే, యూఏఈ సహా పలు దేశాల్లో దావూద్ ఆర్థిక వ్యవహారాలను జాబిర్ పర్యవేక్షించేవాడని తెలిపాడు. దావూద్‌కు, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు మధ్య ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంబంధాలను నిరూపించేందుకు జాబిర్‌ను అమెరికాకు రప్పించాలన్నది ఎఫ్‌బీఐ ప్రణాళికగా ఉందని కమ్రాన్ వెల్లడించాడు.
ఈ కేసులో అమెరికా కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌లో ఉన్న తన కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళనతో వెనక్కి తగ్గినట్లు కమ్రాన్ తెలిపాడు. దావూద్‌కు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI)తో సంబంధాలు ఉన్నాయని, తన కుటుంబానికి హాని కలిగించే ప్రమాదం ఉందని భయపడినట్లు పేర్కొన్నాడు. తాను సాక్ష్యం చెప్పకపోవడాన్ని అవకాశంగా తీసుకుని దావూద్ తన అనుచరుడు జాబిర్‌ను తిరిగి పాకిస్థాన్‌కు రప్పించుకున్నాడని ఆరోపించాడు. అనంతరం తన అమెరికన్ భార్యతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడు దావూద్, అతడి అనుచరుల ప్రభావంతో తనను అరెస్టు చేయించారని, నెలల తరబడి జైలులో ఉంచారని కమ్రాన్ చెప్పాడు. అమెరికా పౌరసత్వం ఉండటంతోనే తాను ప్రాణాలతో బయటపడగలిగానని, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉంటున్నానని వెల్లడించాడు. మరోవైపు, దావూద్ వ్యక్తిగత జీవితం, విలాసాల గురించి కూడా పలు ఆరోపణలు చేశాడు. దావూద్ ఇప్పటికీ పాకిస్థాన్‌లో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాడని, భారత్, పాకిస్థాన్‌లలో నడుస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌లతో అతడి గ్యాంగ్‌కు సంబంధాలు ఉన్నాయని కమ్రాన్ ఆరోపించాడు. ధురంధర్ సినిమాలో దావూద్‌ను నిస్సహాయుడైన వృద్ధుడిగా చూపించడం వాస్తవ పరిస్థితులకు భిన్నమని కూడా వ్యాఖ్యానించాడు.
కరాచీలో దావూద్ సంచారం, భద్రతా ఏర్పాట్లపై కూడా కమ్రాన్ పలు వివరాలు వెల్లడించాడు. దావూద్ పగటిపూట బయటకు రావడం చాలా అరుదని, ఎక్కువగా రాత్రి వేళల్లోనే సంచరిస్తాడని పేర్కొన్నాడు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా తన స్థావరాలను మార్చుకుంటాడని ఆరోపించాడు. దావూద్, అతడి అనుచరుడు ఛోటా షకీల్ కోసం దుబాయ్ నుంచి ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తెప్పిస్తారని తెలిపాడు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎస్ఎస్‌జీ కమాండోలు దావూద్‌కు భద్రత కల్పిస్తారని, ఈ ఏర్పాట్లను ఛోటా షకీల్ పర్యవేక్షిస్తాడని కమ్రాన్ పేర్కొన్నాడు. ప్రతి శుక్రవారం ఛోటా షకీల్ ఐఎస్ఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి భద్రతకు సంబంధించిన వివరాలను అందిస్తాడని ఆరోపించాడు. పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లోనూ దావూద్‌కు పలుకుబడి ఉందని, ఒకసారి మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి నేరుగా ఫోన్ చేసి తన పని చేయించుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా, ముంబై నుంచి ఇస్లాం బాబా అనే ఫకీర్‌ను పాకిస్థాన్‌కు తీసుకెళ్లాడని, అతడి అనుమతి లేకుండా దావూద్ లేదా అతడి అనుచరులు ముఖ్యమైన పనులు చేపట్టరని చెప్పాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడైన టైగర్ మెమన్ కూడా పాకిస్థాన్‌లోనే ఉంటూ తన వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని, అయితే దావూద్, ఛోటా షకీల్ అతడికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కమ్రాన్ పేర్కొన్నాడు. అయితే ఇవన్నీ కమ్రాన్ ఇంటర్వ్యూలో చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలేనని, వాటికి స్వతంత్ర ధ్రువీకరణ లేదని గమనించాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!