

భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో పేదరికాన్ని తగ్గించడంలోనూ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫిక్కీ వార్షిక సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన సంస్కరణలపై కార్పొరేట్ సంస్థలు తమ సూచనలను స్వేచ్ఛగా వెల్లడించాలని కోరారు. గత 12 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పు వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాలు, కాలం చెల్లిన నిర్ణయాలు దేశ వృద్ధిని మందగింపజేశాయని విమర్శించారు.
గత 13 ఏళ్లలో భారత్లో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించినట్లు మోదీ పేర్కొన్నారు. వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వ్యక్తులకు పన్ను మినహాయింపు కల్పించామని వివరించారు. రాబోయే 20 ఏళ్లలో చేపట్టే దీర్ఘకాలిక పెట్టుబడులకు ‘ఇండియా ఫస్ట్’ విధానమే పునాదిగా ఉండాలని పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!