

దేశంలో 2029 నాటికి మాదకద్రవ్యాల సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర గురువారం రెండో రోజు కొనసాగింది. ప్రచారం కోసం, సోషల్ మీడియాలో లైకుల కోసం లేదా బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ యాత్ర చేపట్టలేదని, సమాజాన్ని, భవిష్యత్ తరాలను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడాలనే నిబద్ధతతో నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. ముషీరాబాద్‌లోని కశిష్ హాల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, హిమాయత్‌నగర్, లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట మీదుగా అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వరకు సాగింది. ఈ యాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ అడవుల్లో ఔషధ మొక్కల సాగు పేరుతో గంజాయి పండిస్తున్నారంటూ కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తుందని ఆశచూపి కొందరు రైతులతో గంజాయి సాగు చేయిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బస్తీలు, కాలనీల్లో గంజాయి చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో లభిస్తుండటం యువత భవిష్యత్‌కు ప్రమాదకరమని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలన పోరాటంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడం ప్రభుత్వాల వల్ల మాత్రమే సాధ్యం కాదని, ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ యువతను డ్రగ్స్ మాఫియా నుంచి పూర్తిగా కాపాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ గణాంకాలను ప్రస్తావిస్తూ, 2014లో 169 డ్రగ్స్ కేసులు నమోదవగా, గత ప్రభుత్వ హయాంలో 2023లో 1,487 కేసులు నమోదయ్యాయని విమర్శించారు. అప్పటి నుంచి కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పుల్లెల గోపీచంద్ కోరారు. రెండో రోజు పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, దేవనాథ్ జీయర్ స్వామి, నటి రష్మికా ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జరగనున్న పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి సినీ నటులు చిరంజీవి, నాగార్జున, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ హాజరుకానున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!