

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని గెద్దాడ గ్రామంలో జాతీయ రహదారి-216 పక్కన ఉన్న ఓఎన్జీసీ బావి నుంచి నవంబర్ 17 తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయింది. బావి వద్ద వర్కోవర్ పనులు జరుగుతున్న సమయంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముందస్తు జాగ్రత్తగా బావి చుట్టూ 500 మీటర్ల పరిధిని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, సమీప నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను మళ్లించారు. ఓఎన్జీసీ అత్యవసర బృందాలు చేపట్టిన చర్యలతో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గ్యాస్ ప్రవాహాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.
కోనసీమ ప్రాంతంలో గతంలోనూ గ్యాస్ లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడంతో చమురు, సహజవాయు బావుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశ ఇంధన అవసరాలకు ఈ వనరులు కీలకమైనప్పటికీ, వాటి చుట్టుపక్కల నివసించే ప్రజల ప్రాణాలు, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పాత బావుల్లో తిరిగి తవ్వకాలు లేదా మరమ్మతు పనులు చేపట్టే ముందు భద్రతా పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా బ్లోఔట్ ప్రివెంటర్ల పనితీరును పరీక్షించడంతో పాటు, ప్రతి బావి వద్ద గ్యాస్ లీకేజీని గుర్తించే ఆధునిక సెన్సార్లు, ప్రజలను అప్రమత్తం చేసే ఆటోమేటిక్ సైరన్లు ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర పరికరాలు సిద్ధంగా ఉంచాలి. స్థానిక అధికారులతో సమన్వయం, ముందస్తు తరలింపు ప్రణాళికలు కూడా తప్పనిసరి. ఇలాంటి చర్యలను క్రమం తప్పకుండా అమలు చేసినప్పుడే భవిష్యత్తులో ప్రమాదాలను తగ్గించి ప్రజలకు భద్రత కల్పించగలం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!