

తెలంగాణలో ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం కారణంగా ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, 460 టీఎంసీలకు బదులుగా ప్రస్తుతం 209 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని లేఖలో పేర్కొన్నారు. వర్షాభావం వల్ల చెరువులు, భూగర్భజలాలు, బోర్లు, వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా విషయంలోనూ ముందస్తు జాగ్రత్తలు అవసరమని తెలిపారు. భూగర్భజలాల వినియోగం పెరగడం వల్ల వ్యవసాయ విద్యుత్ డిమాండ్, రైతుల సాగు ఖర్చులు పెరిగే అవకాశం ఉందని వివరించారు.
కాంగ్రెస్ నాయకులు గ్రామాలు, మండలాల వారీగా నీటి పరిస్థితిని సమీక్షించాలని మహేష్ గౌడ్ సూచించారు. చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను పరిశీలించడం, తాగునీటి కొరత ఎదురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించడం, రైతులకు నీటి లభ్యత ఆధారంగా పంటల ఎంపికపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాల లభ్యత, పంటల బీమా, ప్రభుత్వ సహాయంపై రైతులకు సమాచారం అందించాలని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, రాష్ట్రం కోరనున్న ప్రత్యేక ఆర్థిక సహాయంపై కూడా స్పందించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని అనుసరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!