

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 4,89,233 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. గురువారం అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పింఛన్ల విడుదలను ప్రకటించడంతో పాటు కొంతమంది లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కొత్త లబ్ధిదారులందరి ఖాతాల్లోకి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని నవంబర్ నెల పింఛనుగా పరిగణించనున్నట్లు తెలిపింది. కొత్తగా పింఛన్లు పొందిన వారికి డిసెంబర్లో పాత లబ్ధిదారులతో కలిసి తదుపరి పింఛను అందనుంది.
కొత్తగా పింఛన్లు పొందిన వారిలో దాదాపు 70 శాతం మంది వితంతువులు, ఒంటరి మహిళలే ఉన్నారు. కేటగిరీల వారీగా చూస్తే 2,89,713 మంది వితంతువులు, 53,841 మంది ఒంటరి మహిళలు, 1,00,273 మంది దివ్యాంగులు, 27,437 మంది కల్లుగీత కార్మికులు, 2,938 మంది ఎయిడ్స్ బాధితులు, 4,450 మంది చేనేత కార్మికులు, 6,375 మంది పైలేరియా వ్యాధిగ్రస్తులు, 1,970 మంది డయాలసిస్ రోగులు, ప్రజావాణి ద్వారా గుర్తించిన ఇతర విభాగాలకు చెందిన 2,236 మంది ఉన్నారు. వీటితో పాటు పింఛను పొందుతున్న భార్య లేదా భర్త మరణించిన సందర్భాల్లో వారి జీవిత భాగస్వామికి అందించే ఇన్స్టంట్ పింఛన్లు 1,23,625 మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మంజూరు చేసిన పింఛన్ల సంఖ్య మొత్తం 6,12,858కు చేరిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!