

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పరిసరాలు, కాకినాడ తీర ప్రాంతాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీర రహదారికి జరిగిన నష్టం, ఇళ్ల పరిస్థితి, ఏలేరు ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకొరగడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోనే 93 రహదారులు దెబ్బతినగా, సుమారు 736 చెట్లు నేలకొరిగినట్లు వివరించారు. రహదారులపై అడ్డంకులను త్వరగా తొలగించాలని, వాగులు, వంకలు, చెరువుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
సమీక్షలో వెల్లడించిన ప్రాథమిక అంచనాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపగా, 28,000 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సుమారు 70,000 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు, మరో 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు కూడా నష్టం వాటిల్లింది. సహాయక చర్యల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు వివిధ శాఖలకు చెందిన సుమారు 32,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యానికి ఇబ్బందులు లేకుండా చూడాలని, దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నిల్వ నీటిలో క్లోరినేషన్, బ్లీచింగ్ ద్వారా అంటువ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, పంటలు, ఇళ్లు, ఆస్తుల నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి పరిహారం కోసం నివేదికలు పంపాలని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వాతావరణ శాఖ అనుమతి ఇచ్చే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!