

ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 (GTA 6) విడుదల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికరంగా స్పందించారు. GTA 5, GTA 6 విడుదల మధ్య ఉన్న 13 ఏళ్ల వ్యవధిని ప్రస్తావిస్తూ.. ఈ కాలంలో భారత్ సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించే ప్రత్యేక గ్రాఫిక్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలన, డిజిటల్ చెల్లింపుల విస్తరణ, అంతరిక్ష రంగంలో విజయాలు, నక్సలిజం నిర్మూలన దిశగా పురోగతి వంటి అంశాలను ఈ చిత్రాల్లో పొందుపరిచారు. ‘భారత్ ఇప్పుడు సరికొత్త ఆట ఆడుతోంది’ అంటూ ప్రధాని ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
మరోవైపు GTA 5 విడుదలైన 13 ఏళ్ల తర్వాత వస్తున్న GTA 6పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లో విడుదలైన ఈ గేమ్ తొలి ట్రైలర్‌కు మొదటి రోజే 9 కోట్లకు పైగా వీక్షణలు రావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఈ గేమ్ రూపకల్పనలో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ రాక్‌స్టార్ గేమ్స్ స్టూడియోకు చెందిన సుమారు 1,615 మంది డెవలపర్లు భాగస్వాములైనట్లు సమాచారం. ఓపెన్ వరల్డ్ ఎన్విరాన్‌మెంట్, గేమ్ అసెట్స్, వరల్డ్ బిల్డింగ్, వైస్ బీచ్ వంటి అంశాల రూపకల్పనలో వారు కీలక పాత్ర పోషించారు. 1995లో రాజేశ్ రావు స్థాపించిన ధ్రువ ఇంటరాక్టివ్ సంస్థను 2019లో రాక్‌స్టార్ గేమ్స్ కొనుగోలు చేసింది. ఈ గేమ్ ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X|S ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!