

పేదరికం నుంచి బయటపడిన ప్రజలు తిరిగి అదే పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని, పొదుపు అలవాట్లను పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కేవలం సంపాదించడం, ఖర్చు చేయడమే కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం ఆదాయంలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ‘తిను, తాగు, ఎంజాయ్ చేయి’ అనే ధోరణికి బదులుగా ఆర్థిక బాధ్యతతో వ్యవహరించే అలవాటును పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. 2011 నుంచి 2023 మధ్య దేశంలో దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. ఇది దేశానికి గర్వకారణమని, ఈ విజయానికి ప్రభుత్వాలు, అధికారులు, పారిశ్రామిక రంగం, ప్రజల సమష్టి కృషి కారణమని గుర్తుచేశారు.
పేదరిక నిర్మూలనతో ప్రభుత్వ బాధ్యత ముగిసిపోదని, ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా పొదుపు, ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. మరోవైపు దేశ యువతను మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం, సమాజం సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. నక్సలిజాన్ని నియంత్రించడంలో సాధించిన పురోగతిని ఉదాహరణగా తీసుకుని, అదే సంకల్పంతో డ్రగ్స్ సమస్యను కూడా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. నక్సలిజం మళ్లీ బలపడకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, పేదరిక నిర్మూలన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!