

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ మోటార్స్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. హైదరాబాద్లోని అనుకూల వాతావరణం, రవాణా సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను వివరించారు. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రిని కలిసింది. జహీరాబాద్లోని జాతీయ పెట్టుబడులు, తయారీ మండలం (నిమ్జ్)లో ప్రతిపాదించిన సమగ్ర అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అనుమతులను వేగవంతం చేసి, అన్ని విధాలా సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టుకు రూ.8,528 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించగా, 678 ఎకరాల్లో దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల 4,276 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. రానున్న నెలల్లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హ్యుందాయ్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. జహీరాబాద్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రంతో పాటు భారీ వాహన పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని రవాణా మౌలిక సదుపాయాలు, మొబిలిటీ క్లస్టర్లు, పారిశ్రామిక విస్తరణ ప్రణాళికలను సీఎం వివరించి, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026కు హ్యుందాయ్ ప్రతినిధులను ఆహ్వానించారు. హైదరాబాద్ను అంతర్జాతీయ సాంకేతిక, అధునాతన ఇంజినీరింగ్ కేంద్రంగా బలోపేతం చేయాలన్న హ్యుందాయ్ లక్ష్యం తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఉందని చాంగ్యోన్ చో తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!