

తిరుమల-తిరుపతి తరహాలో శబరిమలను అభివృద్ధి చేసి, అయ్యప్ప భక్తులకు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రకటించారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శబరిమల యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రతి మండల సీజన్‌లో లక్షలాది మంది భక్తులు శబరిమలకు వస్తున్నారని, వారికి అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రణాళిక అమలైతే భవిష్యత్తులో భక్తుల సంఖ్య సుమారు 50 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత మండల సీజన్ ముగిసిన తర్వాత దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
శబరిమల దర్శనం పూర్తయ్యాక భక్తులు వెంటనే తిరిగి వెళ్లకుండా, కేరళంలోని ఇతర ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించేలా ఆధ్యాత్మిక పర్యాటక నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొచ్చిన్ విమానాశ్రయంలో 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన యాత్రికుల సహాయ కేంద్రం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఇందులో దేవస్వం బోర్డు హెల్ప్ డెస్క్, ప్రసాదం కూపన్ కౌంటర్, ప్రీపెయిడ్ ట్యాక్సీ బుకింగ్, శాకాహార భోజనం, ఏసీ విశ్రాంతి గది, ఉచిత వైఫై, విమానాల రాకపోకల సమాచారం వంటి సదుపాయాలు ఉన్నాయి. కేఎస్‌ఆర్టీసీ, చార్టర్డ్ బస్సులతో పాటు హెలికాప్టర్ సేవల బుకింగ్ సదుపాయం కూడా కల్పించారు. విమానాశ్రయం నుంచి శబరిమలకు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను కూడా సీఎం ప్రారంభించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!