

ఓబీసీ క్రీమీలేయర్ వర్తింపునకు సంబంధించి దేశవ్యాప్తంగా గతంలోనే పూర్తయిన నియామకాలు, పదోన్నతులు, సీనియారిటీ ప్రయోజనాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఈ నిర్ణయాలకు కొత్త మార్గదర్శకాలను వెనుకటి తేదీ నుంచి వర్తింపజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఓబీసీ క్రీమీలేయర్‌కు సంబంధించి ఇప్పటికే వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల విచారణలు కొనసాగించవచ్చని, ఆయా కేసుల్లో మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ నరసింహ, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
రిజర్వేషన్ల కింద నియామకాలు, పదోన్నతుల సమయంలో ఓబీసీ క్రీమీలేయర్‌ను నిర్ణయించేందుకు అభ్యర్థి, వారి తల్లిదండ్రుల ఆదాయాన్ని మాత్రమే కాకుండా.. తల్లిదండ్రులు ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న హోదా, ఉద్యోగ కేటగిరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 11న పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, క్రీమీలేయర్ నిర్ణయానికి కొత్త నిబంధనలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ తీర్పును ఇప్పటికే పూర్తయిన నియామకాలు, పదోన్నతులు, ప్రవేశాలకు వర్తింపజేస్తే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని కేంద్రం వివరణ పిటిషన్ దాఖలు చేసింది. కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని కూడా కేంద్రం ధర్మాసనాన్ని కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వివిధ స్థాయుల్లోని ఉద్యోగాలకు సమాన హోదాలను నిర్ణయించడానికి సమయం అవసరమని వివరించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!