

తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న తొలి ముద్ద అల్పాహార పథకాన్ని మరో ఏడు జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని భూపాలపల్లి, జనగామ, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తాజా విస్తరణతో కొత్తగా 43,657 మంది చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం పోషకాహారంతో కూడిన అల్పాహారం అందనుంది. ఇప్పటికే ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లోని 8,694 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం అమలవుతోంది.
తాజా విస్తరణతో మొత్తం 14 జిల్లాల్లో 1,35,453 మంది చిన్నారులకు తొలి ముద్ద పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన 19 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పథకం విస్తరణపై మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారులు ఆకలితో ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషకాహార స్థాయిని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!