

నాగార్జునసాగర్ జలాశయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు లేఖ రాశారు. విజయపురి సౌత్ వద్ద సుమారు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీరు అందించడం దీని లక్ష్యంగా పేర్కొంటున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ స్థాయి 155.48 మీటర్ల కంటే దిగువన, 150.45 మీటర్ల వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మించాలని ప్రతిపాదించడంపై తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల జలాశయ భద్రతతో పాటు నీటి నియంత్రణ, నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. ఇప్పటికే నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ ఏటా 2.84 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తోందని గుర్తుచేసింది. అదనంగా నీటిని తరలించాలంటే కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం విభజన చట్టం, నదీ జలాల పంపిణీ నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ అభిప్రాయపడుతోంది.
మరోవైపు, తెలంగాణకు కేటాయించిన నదీ జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునే ప్రసక్తి లేదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రతిపాదనలు, అనుమతులను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన అనుమతులు లేకుండా పనులు కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని, కేఆర్ఎంబీని కోరుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!