

గతంలో పది వేల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించి విదేశాల్లోని తెలుగు వారిని ఆకర్షించిన తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీప్యాడ్), ఈసారి దాదాపు 15 వేల మందితో మరింత ఘనంగా వేడుకలను నిర్వహించింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలోని ప్రతిష్ఠాత్మక కొమెరికా సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం భారీ సమ్మేళనాన్ని తలపించింది. వెయ్యి మందికి పైగా మహిళలు, యువతులు బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొని తెలంగాణ సంప్రదాయాల వైభవాన్ని చాటారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మల నిమజ్జనం నిర్వహించారు. మహిషాసురమర్దిని నృత్యరూపకం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తెలుగు సినీ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తనదైన హాస్యంతో, డ్యాన్సులతో ప్రేక్షకులను అలరించి వేడుకల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య నేతృత్వంలోని ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. టీప్యాడ్ అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డి నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి 20 కమిటీలు మూడు నెలల పాటు శ్రమించినట్లు నిర్వాహకులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!