

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 24న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భరణి దీపం, మహాదీప దర్శనానికి మొత్తం 3 వేల ఉచిత ప్రవేశ టికెట్లు కేటాయించినట్లు తమిళనాడు హిందూ ధార్మిక దేవాదాయ శాఖ ప్రకటించింది. గతంలో అమల్లో ఉన్న చెల్లింపు టికెట్ల విధానానికి బదులుగా ఈ ఏడాది ఉచిత టికెట్లు అందించనున్నారు. మొత్తం టికెట్లలో భరణి దీప దర్శనానికి వెయ్యి, మహాదీప దర్శనానికి 2 వేల టికెట్లు కేటాయించారు.
నవంబర్ 24న తెల్లవారుజామున 4 గంటలకు ఆలయంలో భరణి దీపాన్ని వెలిగిస్తారు. అదే రోజు సాయంత్రం ఆలయం వెనుక ఉన్న 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల కొండపై మహాదీపాన్ని వెలిగించనున్నారు. భక్తులు నవంబర్ 18 ఉదయం 11 గంటల నుంచి నవంబర్ 20 మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ అధికారిక వెబ్సైట్లో ఆధార్ నంబర్‌తో ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. భరణి దీపం టికెట్లలో 500, మహాదీపం టికెట్లలో వెయ్యి తిరువణ్ణామలై జిల్లా భక్తులకు కేటాయించగా, మిగిలినవి ఇతర జిల్లాల భక్తులకు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 20న సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపడంతో పాటు ఎలక్ట్రానిక్ టికెట్లు అందిస్తారు. వాటిని డౌన్లోడ్ చేసుకుని నవంబర్ 24న నిర్ణీత ప్రవేశ ద్వారం వద్ద స్కాన్ చేయించుకున్న తర్వాత దర్శనానికి వెళ్లవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!