

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ ముఠా ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌కు సంబంధించిన అసభ్యకరమైన, అభ్యంతరకరమైన డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలను సృష్టించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరిస్తూ తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేసిన నిందితులు.. చివరకు రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. బెదిరింపులతో ఆందోళనకు గురైన ఎమ్మెల్సీ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన కోళ్ల వ్యాపారి మహ్మద్ మొహిసిన్‌ఖాన్, ఫాతిమా బేగం, మహ్మద్ సమీర్, మహ్మద్ జమీర్, సయ్యద్ రెహాన్, బార్కస్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఇమ్రాన్ సహా మొత్తం 14 మంది ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలను సేకరించి, వాటిని డీప్‌ఫేక్ సాంకేతికతతో అసభ్యకరంగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను ఎమ్మెల్సీ మొబైల్‌కు పంపించి, డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేసి పరువు తీస్తామని బెదిరించారు. పోలీసుల సూచన మేరకు ఎమ్మెల్సీ నిందితులతో బేరం జరిపారు. తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా చివరకు రూ.5 లక్షలకు అంగీకరించింది.
పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయానికి వచ్చి డబ్బు తీసుకోవాలని చెప్పడంతో.. గురువారం ఆరుగురు నిందితులు అక్కడికి చేరుకుని, పెట్టెలో ప్యాక్ చేసిన నగదును తీసుకున్నారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు వారు పారిపోతుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరో ఎనిమిది మంది పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. గతంలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో మీర్జా రహమత్ బేగ్‌ను ఎంఐఎం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ బ్లాక్‌మెయిల్ వ్యవహారం వెనుక ఆయన ప్రత్యర్థుల ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఠా వెనుక ఉన్న సూత్రధారులు, ఎమ్మెల్సీని లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!