

ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 34 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి బుధవారం రాత్రి బెంగళూరుకు బయలుదేరిన బస్సు.. గురువారం తెల్లవారుజామున వరగలి క్రాస్ రోడ్డు కూడలి వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగడాన్ని డ్రైవర్ అద్దంలో గమనించాడు.
వెంటనే ఫైర్ అలారం మోగించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!