

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు చేరుకున్నారు. విమానాశ్రయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్‌పై ట్రంప్ నడుచుకుంటూ వస్తుండగా ఇరువైపులా ప్రజలు, చిన్నారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం చెప్పారు. విదేశీ దేశాధినేతకు చైనాలో ఈ స్థాయిలో ఆహ్వానం పలకడం అరుదుగా జరుగుతుందని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సు సందర్భంగా ట్రంప్, జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా కీలక చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, కృత్రిమ మేధ (AI), అణ్వాయుధాల నియంత్రణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.
మరోవైపు, బుధవారం రాత్రి విందు సందర్భంగా ట్రంప్, పుతిన్ సమావేశమయ్యే అవకాశం ఉందని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ సీనియర్ సహాయకుడు యూరీ ఉషకోవ్ వెల్లడించారు. APEC సదస్సు ముగిసిన తర్వాత కూడా ఇరువురు నేతలు మరోసారి భేటీ కావచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా, తన చైనా పర్యటనలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందని ట్రంప్ మంగళవారం పేర్కొన్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై ఆ దేశంతో మళ్లీ చర్చలు ప్రారంభించాలని అమెరికా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ భేటీలు కార్యరూపం దాల్చితే అంతర్జాతీయ భద్రత, అణ్వాయుధ నియంత్రణ, ప్రపంచ దౌత్య సంబంధాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!