

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన సాధికార మండలి తొలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరగనుంది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర చైర్మన్‌గా, ఐఏఎస్ అధికారులు వినయ్ చంద్, కన్నబాబు సభ్యులుగా ఏర్పాటైన ఈ మండలి తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలో డిసెంబర్ 4 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం వంటి అంశాలపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. భక్తుల సౌకర్యాలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలకు ఇబ్బందులు ఉండకపోవచ్చని భావిస్తున్నప్పటికీ, కొత్త ఆలయాలు, కల్యాణ మండపాల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఎన్నికల కోడ్ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను నిలిపివేయడంతో ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. ధార్మిక సంస్థ అయిన టీటీడీకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎంతవరకు వర్తిస్తుంది? సాధికార మండలి నిర్ణయాలపై ఎలాంటి పరిమితులు ఉంటాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ అంశాలు కూడా సమావేశంలో చర్చకు వస్తాయా అన్న ఆసక్తి నెలకొంది. తొలి సమావేశంలో అజెండాగా చేర్చిన అంశాలు, తీసుకోబోయే నిర్ణయాలపై సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!