

హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ రిజిస్ట్రేషన్ కలిగిన రెండు కంటైనర్ నౌకలపై గుర్తుతెలియని ప్రొజె దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఒక నౌక పూర్తిగా దగ్ధమై సముద్రంలో మునిగిపోగా, సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించింది.
'జీఎఫ్ఎస్ ప్రైడ్' అనే నౌకపై దాడి జరగడంతో మంటలు చెలరేగి అది సముద్రంలో మునిగిపోయిందని, అయితే అందులోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించామని ఎంపీఏ తెలిపింది. 'జీఎఫ్ఎస్ గిసెల్' అనే మరో నౌక స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, తనంతట తానుగా సురక్షిత ప్రాంతానికి చేరుకుందని, దానిలోని 22 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని వివరించింది. ఈ రెండు నౌకల్లోనూ సింగపూర్ పౌరులెవరూ లేరని అధికారులు స్పష్టం చేశారు.
అయితే, ఈ ఘటనపై ఇరాన్ భిన్నమైన కథనాన్ని వినిపిస్తోంది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ జలాల్లోకి అనధికారికంగా, ప్రమాదకర మార్గంలో ప్రవేశించిన ఒక నౌక, నేవల్ మైన్ను ఢీకొని పేలిపోయింది. దాదాపు 2,500కు పైగా కంటైనర్లతో వెళ్తున్న ఈ నౌక మంటల్లో చిక్కుకుని మునిగిపోయిందని ఇరాన్ పేర్కొంది. సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్ల వల్ల ఇతర నౌకలకు ప్రమాదం పొంచి ఉందని, సమీపంలోని పడవలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీ అజ్మాయీ మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిని తమ నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. అమెరికా ప్రేరేపణతో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!