

అమెరికా, డెన్మార్క్, గ్రీన్‌లాండ్ మధ్య కొత్త రక్షణ ఒప్పందం కుదిరింది. ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. దీని ప్రకారం గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌లో అమెరికా తన కార్యకలాపాలను ఆధునీకరించి విస్తరించవచ్చు. అలాగే నార్సార్సువాక్, మెస్టర్‌స్విగ్‌లో అదనపు డిఫెన్స్ ఏరియాలను ఏర్పాటు చేసేందుకు మార్గం ఏర్పడింది. భవిష్యత్తులో మరిన్ని డిఫెన్స్ ఏరియాల ఏర్పాటుకు కూడా ఒప్పందంలో విధివిధానాలు పేర్కొన్నారు. అయితే ఇవి మూడు పక్షాల మధ్య సంప్రదింపులు, పరస్పర అంగీకార ప్రక్రియకు లోబడి ఉంటాయి.
రష్యా, చైనాలు ఆర్కిటిక్ ప్రాంతంలో తమ వ్యూహాత్మక, వాణిజ్య కార్యకలాపాలను పెంచుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. గ్రీన్‌లాండ్‌లో నాటోయేతర దేశాలు సొంతంగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం లేదా శాశ్వత సైనిక ఉనికిని కొనసాగించడం ఈ ఒప్పందం ద్వారా నిరోధించబడుతుంది. అలాగే జాతీయ భద్రతకు కీలకమైన రంగాల్లో కొన్ని విదేశీ పెట్టుబడులు, ప్రభావాన్ని కూడా నియంత్రించే నిబంధనలు ఉన్నాయి. వాతావరణ మార్పులతో ఆర్కిటిక్ మంచు కరుగుతుండటంతో కొత్త నౌకా మార్గాలు, సహజ వనరులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్ భౌగోళిక స్థానం అమెరికా, నాటోకు వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. తాజా ఒప్పందం ద్వారా ఆర్కిటిక్‌లో అమెరికా సైనిక సామర్థ్యం, నాటో భాగస్వామ్యం మరింత బలోపేతం కానున్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!