

వందే భారత్ స్లీపర్ రైలు ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇందులోని ఫస్ట్ ఏసీ కోచ్‌ను సాధారణ రైళ్లలోని ఫస్ట్ ఏసీతో పోలిస్తే కొత్త తరహా ఇంటీరియర్ డిజైన్‌తో రూపొందించారు. మరింత మెరుగైన కుషనింగ్‌తో కూడిన బెర్త్‌లు, వేడినీటి షవర్లు, వాక్యూమ్ ఆధారిత టాయిలెట్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సాధారణ కోచ్‌లలో మాదిరిగా చేతులతో తలుపులు తెరవాల్సిన అవసరం లేకుండా టచ్‌తో పనిచేసే ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లను ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల కోసం రీడింగ్ లైట్లు, త్రీ-పిన్ సాకెట్లు, USB టైప్-A, USB టైప్-C ఛార్జింగ్ పోర్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ముంబై–బెంగళూరు మార్గంలో వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ టికెట్ ధర సుమారు రూ.4,450గా పేర్కొన్నారు. ఇందులో ఏసీ 2 టైర్ ధర రూ.3,630 కాగా, ఏసీ 3 టైర్ ధర రూ.2,810గా ఉంది. ఇదే మార్గంలో ప్రయాణించే కోయంబత్తూరు–ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ ఏసీ ఛార్జీ సుమారు రూ.3,425, అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో రూ.3,610గా ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన వందే భారత్ స్లీపర్‌లో ఫస్ట్ ఏసీ ప్రయాణానికి రూ.840 నుంచి రూ.1,025 వరకు అదనంగా చెల్లించాల్సి రావచ్చు. సాధారణ రైళ్లలో ఈ ప్రయాణానికి సుమారు 22 గంటలు పడుతుండగా, వందే భారత్ స్లీపర్‌లో 16 గంటల 10 నిమిషాల్లో చేరుకోవచ్చని కథనం పేర్కొంది. అయితే ప్రయాణ తేదీ, రైలు షెడ్యూల్, బెర్త్‌ల లభ్యత, ఇతర ఛార్జీలను బట్టి టికెట్ ధరలు, ప్రయాణ సమయం మారవచ్చు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!