

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతినిధుల బృందాలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూ వివిధ ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించాయి. నవంబర్ 19న పర్యటనలో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని కుక్నూర్‌పల్లి, ములుగు, మార్పడగ, రాయవరం గ్రామాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని అల్వాల్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాయి. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటిస్తున్న WHO ప్రతినిధులు పది మంది సభ్యులతో కూడిన బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో వైద్య సేవలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందిస్తున్న సేవలు, హైపర్‌టెన్షన్‌తో పాటు ఇతర అసంక్రమిత వ్యాధుల (NCDs) నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ బీపీ మానిటర్లు, తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా అందిస్తున్న వైద్య పరీక్షల సేవలు, వాటి పనితీరును పరిశీలించారు.
అలాగే ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేసి పర్యవేక్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన తెలంగాణ NCD పోర్టల్ పనితీరు, వినియోగ విధానాన్ని కూడా WHO ప్రతినిధులు అధ్యయనం చేశారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, వైద్య సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ప్రజలకు అందిస్తున్న సేవలను వారు ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న ఈ విధానాలను తమ దేశాల్లోనూ అనుసరించే అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర NCD స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కరుణశ్రీ, WHO కన్సల్టెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ అబ్దుల్ వస్సే, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కార్తీక్, డాక్టర్ తేజశ్విని తదితర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!