

హిందూ ధర్మంలో దేవుడి పూజ అంటే కేవలం మంత్రాలు చదవడం, హారతి ఇవ్వడం, నైవేద్యం సమర్పించడం మాత్రమే కాదు. భగవంతుడిని కుటుంబ సభ్యుడిగా, చిన్నపిల్లాడిగా భావించి ప్రేమతో సేవించడం కూడా భక్తిలో ఒక భాగం. ఈ సంప్రదాయం అనేక ఆలయాలు, ఇళ్లలో కనిపిస్తుంది. ముఖ్యంగా కాలానుగుణంగా దేవుడి పూజా విధానాల్లోనూ మార్పులు చేస్తుంటారు. చలికాలం ప్రారంభమైన తర్వాత స్వామివారి వస్త్రధారణ, స్నానం, నైవేద్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మనం చలి నుంచి రక్షణ పొందేందుకు వెచ్చని దుస్తులు ధరిస్తున్నట్లే దేవుడికి కూడా ఉన్ని వస్త్రాలు, శాలువాలు, దుప్పట్లు, రజాయిలు సమర్పిస్తారు. భగవంతుడిని తమ కుటుంబ సభ్యుడిగా భావించి భక్తులు చేసే ఈ సేవ వారి ప్రేమాభిమానాలకు ప్రతీకగా నిలుస్తుంది.
ముఖ్యంగా బాలకృష్ణుడు, బాలరాముడి రూపాలను ఆరాధించే ఆలయాల్లో ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. స్వామివారికి ఉన్ని స్వెటర్లు, మఖమల్ వస్త్రాలు, శాలువాలు, టోపులతో అలంకరణ చేస్తారు. ఉదయం, సాయంత్రం వేర్వేరు వస్త్రాలను సమర్పించడంతో పాటు రాత్రి పవళింపు సేవ సమయంలో వెచ్చని దుప్పట్లు కప్పుతారు. చలికాలంలో కొన్ని ఆలయాల్లో స్నాన విధానంలోనూ మార్పులు చేస్తారు. చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో స్వామివారికి అభిషేకం లేదా స్నానం చేయించి, అనంతరం వెచ్చని వస్త్రాలను అలంకరిస్తారు. ఇళ్లలో దేవతా విగ్రహాలను పూజించే భక్తులు కూడా తమ సంప్రదాయాన్ని బట్టి ఇలాంటి విధానాలను అనుసరిస్తుంటారు.
చలికాలంలో దేవుడికి సమర్పించే నైవేద్యాల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. కాలానికి అనుగుణంగా బెల్లం, నువ్వులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వేడి పాలు, ఖీర్, హల్వా వంటి తీపి పదార్థాలను కూడా నివేదిస్తారు. ముఖ్యంగా బాలగోపాలుడికి కుంకుమపువ్వు కలిపిన పాలు, వెన్న, సుకామేవా, వేడి ఖీర్ సమర్పించడం ఆనవాయితీగా కనిపిస్తుంది. ఇలా చలికాలంలో దేవుడి వస్త్రధారణ నుంచి స్నానం, ఆహార నైవేద్యాల వరకు కాలానుగుణంగా మార్పులు చేయడం వెనుక భక్తుల ప్రేమ, ఆప్యాయత, సేవాభావం దాగి ఉన్నాయి. భగవంతుడిని మనలో ఒకరిగా భావించి చేసే ప్రతి చిన్న సేవ కూడా భక్తిలోని గొప్పతనాన్ని చాటుతుందని ఈ సంప్రదాయం తెలియజేస్తుంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!