

భారతీయ సినిమా గతిని మార్చిన ప్రఖ్యాత దర్శకుడు, సినీ మేధావి సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ప్రయోగాలకు పెట్టింది పేరైన సింగీతం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "సింగీతం శ్రీనివాసరావు గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయనో నిజమైన దార్శనికుడు. కొత్త ఆలోచనలను తెరపై ఆవిష్కరించడంలో ఆయన ధైర్యం, ఊహాశక్తి భారత సినిమాకు కొన్ని మరపురాని చిత్రాలను అందించాయి. ఆయన ఇటీవలి చిత్రం 'సింగ్ గీతం' కథల పట్ల ఆయనకున్న అంతులేని అభిరుచికి నిదర్శనం. ఆయన మనసు ఎప్పుడూ యవ్వనంగా, ఉత్సాహంగా ఉండేది. మేం మిమ్మల్ని మిస్ అవుతాం సింగీతం గారు. మీ సినిమాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయి. ఆయన కుటుంబానికి, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి" అని చిరంజీవి పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సింగీతం గారి గొప్పతనాన్ని వివరిస్తూ నివాళి అర్పించారు. "మన దగ్గర సరైన టూల్స్, బడ్జెట్‌లు లేని రోజుల్లోనే అందరికంటే గొప్పగా కలలు కన్న సాహసి ఆయన. ఒక్క సంభాషణ కూడా లేకుండా సినిమా తీశారు, మనల్ని కాలంలో ప్రయాణింపజేశారు. కామెడీ, ఫాంటసీ, డ్రామా.. ఇలా ఏ జానర్ అయినా అవలీలగా దాటేశారు. సినిమాలో ఊహకు మాత్రమే హద్దు ఉంటుందని ఓ తరాన్నే నమ్మించారు. తెలుగులో కొత్తగా ప్రయత్నించిన ప్రతి దర్శకుడూ ఆయనకు ఎంతో కొంత రుణపడి ఉంటారు. నేను కూడా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి" అంటూ రాజమౌళి తన ఆవేదనను వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!