

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు చెన్నైలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాసరావు అక్టోబర్ 3న చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన మరణవార్తతో తెలుగు, తమిళంతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చెన్నైలోని నేసపాక్కం శ్మశానవాటికలో సింగీతం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు ముందు విరుగంబాక్కంలోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో పలు భాషల్లో విభిన్న కథలు, ప్రయోగాత్మక చిత్రాలతో సింగీతం తనదైన ముద్ర వేశారు. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, మయూరి, మైఖేల్ మదన కామరాజన్ వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. సింగీతం భౌతికంగా దూరమైనా ఆయన సృష్టించిన సినిమాలు, ప్రయోగాలు, కథ చెప్పిన విధానం తరతరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!